Jagan: కేంద్రం ఒక కోటి పదహారు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.. బీజేపీది దుష్ప్రచారం: సజ్జల
- ఒక్క కరోనా కాలంలోనే కేంద్రం రూ. 20 లక్షల కోట్ల అప్పు చేసింది
- ప్రజల జేబుల్లో డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది
- జగన్ మత విశ్వాసం ఆధారంగా బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది
- వైసీపీ నేతలు దీనిని తిప్పికొట్టాలి
వైఎస్ జగన్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోందంటూ బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, వైసీపీ నేతలు దీనిని తిప్పికొట్టాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. రాష్ట్రస్థాయి ఆర్యవైశ్య నేతల సమావేశంలో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. కేంద్రం చేసిన అప్పులతో పోలిస్తే రాష్ట్రం చేస్తున్నది చాలా తక్కువేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. ఒక కోటి పదహారు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందన్న సజ్జల.. ఒక్క కరోనా సమయంలోనే రూ. 20 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందన్నారు.
ప్రజల జేబుల్లో డబ్బులు ఉంటే వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా జమచేశారన్నారు. బీజేపీకి ప్రజా సమస్యలు పట్టవని, సమస్యల పరిష్కారం అనే అజెండానే దానికి లేదని మండిపడిన సజ్జల.. జగన్ ఆచరించే మత విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తోందన్నారు. దీనిని అందరూ సమర్థంగా తిప్పికొట్టాలని వైసీపీ నేతలకు సజ్జల సూచించారు.