Jairam Ramesh: దేశంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనసులోని మాటనే నేను చెపుతున్నా: జైరామ్ రమేశ్

Every Congress worker wants Rahul Gandhi to become party president says Jairam Ramesh

  • కాంగ్రెస్ పగ్గాలను రాహుల్ స్వీకరించాలని అందరూ కోరుకుంటున్నారు
  • కరోనా సెకండ్ వేవ్ వల్ల అధ్యక్షుడి ఎన్నిక జరగలేదు
  • అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లే సత్తా రాహుల్ కి ఉంది

రాహుల్ గాంధీ ఎంతో చలాకీగా ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక అవుతారని ప్రతి కాంగ్రెస్ నేత ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం జూన్ 30న ఎలెక్షన్ షెడ్యూల్ విడుదల చేశామని... అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది జరగలేదని చెప్పారు. దేశంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా రాహుల్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని... వారందరి మనసులోని మాటనే తాను చెపుతున్నానని అన్నారు.

'యంగ్ వర్సెస్ ఓల్డ్' అనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని రమేశ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పోవాల్సిందేనని చెప్పారు. యువ తరానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ ఎంతో అనుభవం కలిగిన పార్టీ అని, పార్టీలో మార్గనిర్దేశం చేయగలిగిన సీనియర్లు ఉన్నారని చెప్పారు. యువతను, సీనియర్లను కలుపుకుని పోవాలని... ఈ విషయం రాహుల్ కు కూడా తెలుసని అన్నారు.
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం అనేది తాత్కాలికం కాదని... ముందుముందు కూడా అన్ని పార్టీలు కలసి పని చేస్తాయని రమేశ్ చెప్పారు. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకమవుతున్నాయని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఈ పార్టీలన్నీ చాలా హోంవర్క్ చేయాల్సి ఉందని అన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని, ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం రాహుల్ కు ఉందని చెప్పారు.

అసోం, కేరళలో అధికారంలోకి వస్తామని తాము భావించామని... అయితే అది జరగలేదని రమేశ్ చెప్పారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితమవుతామని మాత్రం ఊహించలేదని అన్నారు. ఏదేమైనప్పటికీ తాము ఆశాభావంతో ముందుకు సాగుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News