KRMB: కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన తెలంగాణ అధికారులు
- ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం
- కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిపై వివరణ
- రెండు నదీ బోర్డుల ఉమ్మడి సమావేశం
- హాజరుకాలేమని లేఖలు రాసిన తెలంగాణ సర్కారు
- హాజరైన ఏపీ అధికారులు
ఇటీవల కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లోని అంశాలపై చర్చించేందుకు ఇవాళ కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశమైంది. హైదరాబాదులోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్ల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు.
ఈ భేటీలో బోర్డుల సభ్య కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఏపీ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్, ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఏపీ ప్రతినిధులు స్పందిస్తూ, గెజిట్ నోటిఫికేషన్ లో అభ్యంతరాలపై కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. అభ్యంతరాలు లేని ప్రాజెక్టుల వివరాలు ఇస్తామని పేర్కొన్నారు. వివరాల సమర్పణకు ఏపీ అధికారులు వారం గడువు కోరారు.
ఏపీ అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లవచ్చని బోర్డు చైర్మన్లు తెలిపారు. నెలలో గెజిట్ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదని వెల్లడించారు. గెజిట్ అమలుపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని వివరించారు. అయితే, బోర్డులు అడిగిన సమాచారం ఇవ్వాలని చైర్మన్లు ఏపీకి స్పష్టం చేశారు.
కాగా, ఈ సమావేశాలకు తాము హాజరు కావడంలేదని తెలంగాణ ప్రభుత్వం ఆయా బోర్డులకు ఇప్పటికే లేఖలు రాసింది. సుప్రీంకోర్టులోనూ, ఎన్జీటీలోనూ జల వివాదాలపై విచారణ ఉన్నందున, ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని బోర్డులకు రాసిన లేఖల్లో స్పష్టం చేసింది. మరో రోజున సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది.
సంయుక్త సమన్వయ కమిటీ గతంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా గైర్హాజరైంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే, నదీ జలాలపై న్యాయపరమైన పోరాటాలతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.