Parliament: సభకు గైర్హాజరవుతున్న పార్టీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం!
- ఎవరెవరు రాలేదో చెప్పాలని ఆదేశం
- సభా చర్చలపై పార్టీ ఎంపీలతో సమావేశం
- గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీయాలని ఆదేశం
పలువురు బీజేపీ ఎంపీలు చిక్కుల్లో పడ్డారు. పార్లమెంట్ లో ప్రధాన బిల్లులపై చర్చ నడుస్తుండగా వారు సభకు డుమ్మా కొట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఎవరెవరు రాలేదో పేర్లు చెప్పాలని పార్టీ నేతలను అడిగారు. నిన్న రాజ్యసభకు చాలా మంది బీజేపీ ఎంపీలు డుమ్మా కొట్టిన విషయాన్ని.. ఈరోజు ఉదయం జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన ప్రస్తావించారు.
కాగా, ఈ సమావేశంలో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల ప్రదర్శనపైనే ఎక్కువగా చర్చ జరిగింది. పతకాలు సాధించిన ఏడుగురికి ఎంపీలు నిలబడి చప్పట్లు కొట్టి గౌరవం తెలిపారు. ఎంపీలంతా తమతమ నియోజకవర్గాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న వారిని వెలికి తీయాలని సూచించారు. బాలబాలికలకు ఈ విషయంలో పోటీలు పెట్టాలని సూచించారు.
క్రీడాకారులు బడికిపోనంత మాత్రాన అది తప్పుకాదన్న విషయాన్ని అందరికీ చాటి చెప్పాల్సిందిగా ఎంపీలకు ప్రధాని సూచించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పేదలకు పోషకాహారం అందించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. పేదలందరికీ ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ అందేలా చర్యలు తీసుకోవాలని, అది లేకుండా ఒక్క పేద వ్యక్తి కూడా ఉండకూడదని చెప్పారన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద.. ప్రతి రైతుకూ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.