Tamil Nadu: అప్పుల ఊబిలో తమిళనాడు.. ప్రతిరోజు ఎన్ని కోట్ల వడ్డీ చెల్లిస్తోందంటే..!
- ప్రతి రోజు రూ. 87 కోట్లకు పైగా వడ్డీ చెల్లిస్తున్న తమిళనాడు
- గత ఐదేళ్లలో రూ. 3 లక్షల కోట్ల అప్పులు
- ఒక్కో కుటుంబంపై రూ. 2.63 లక్షల రుణభారం
తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చేసిన అప్పులకు గాను ప్రతి రోజు రూ. 87 కోట్లకు పైగా వడ్డీని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి త్యాగరాజన్ వెల్లడించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం పదేళ్లలో ఇష్టానుసారం అప్పులు చేసిందని ఆయన తెలిపారు.
గత ఐదేళ్లలోనే రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. ఈ అప్పుల్లో 50 శాతాన్ని రోజువారీ ఖర్చులకే వినియోగించిందని... దీని వల్ల అది రెవెన్యూ లోటుగా మారిందని అన్నారు. తమిళనాడులోని 2.16 కోట్ల కుటుంబాలలో... ఒక్కో కుటుంబంపై రూ. 2.63 లక్షల రుణభారం ఉందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వడ్డీ చెల్లించాల్సి వస్తోందని అన్నారు.