Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఆస్తులు కొన్న ఇతర రాష్టాల వ్యక్తులు!
- జమ్మూకశ్మీర్ లో ఆస్తులు కొన్న ఇద్దరు వ్యక్తులు
- పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ఆస్తులు కొనే సమయంలో వారికి ఇబ్బందులు ఎదురు కాలేదన్న కేంద్రం
ఆర్టికల్ 370 ఉన్నంత కాలం జమ్మూకశ్మీర్ లో బయటివారు ఆస్తులు కొనేందుకు వీలు లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే 2019 ఆగస్ట్ 5న ఆ ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతే కాదు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ మార్పు ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ లో బయటి వ్యక్తులు ఇద్దరు ఆస్తులు కొన్నారని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆస్తుల వివరాలను, ఆస్తులు కొన్న వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.
జమ్మూకశ్మీర్ లో ఆస్తులు కొనాలనుకునే బయటివారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019 ఆగస్టు తర్వాత ఇద్దరు బయటి వ్యక్తులు అక్కడ ఆస్తులు కొన్నారని ఆయన తెలిపారు. ఆస్తులు కొనేటప్పుడు వారికి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పారు.