Venkaiah Naidu: రాజ్యసభలో వెంకయ్య నాయుడు కంటతడి.. షెడ్యూల్ కన్నా ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా
- ఎంపీల ప్రవర్తనపై వెంకయ్య నాయుడు ఆవేదన
- పరిణామాలు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదని వ్యాఖ్య
- ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయంలాంటిదన్న వెంకయ్య నాయుడు
- లోక్‌సభలోనూ గందరగోళం
రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం, కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం వంటి చర్యలతో సభ పవిత్రత దెబ్బతిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని ఆయన చెప్పారు.
అంతేకాదు, భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయంలాంటిదని అన్నారు. అయినప్పటికీ, అదే సమయంలోనూ కొందరు సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
మరోవైపు, పెగాసస్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వంటి అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తుండడంతో షెడ్యూల్ కన్నా ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెగాసస్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టి, లోక్‌సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విషయం తెలిసిందే. సభా కార్యకలాపాలను అడ్డుకుంటుండడంతో సభలో చర్చలు జరిగే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ, గందరగోళం మధ్యే పలు కీలక బిల్లులన్నింటినీ ఎలాంటి చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది.