High Court: వివాహితకు ప్రేమ‌లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లే: బాంబే హైకోర్టు

Sending  love letter to a married woman is wrong says Bombay High Court

  • మ‌హారాష్ట్ర‌లోని అకోలాలో వివాహిత‌కు ప్రేమ లేఖ‌
  • దుకాణ య‌జ‌మానికి శిక్ష‌
  • వివాహత ప‌ట్ల అలా ప్ర‌వ‌ర్తించ‌డం ఆమె నిబద్ధతను శంకించడమేనన్న కోర్టు

వివాహితకు ప్రేమ‌ లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లేన‌ని బాంబే హైకోర్టు పేర్కొంది. త‌న‌కు ప్రేమ లేఖ పంపిన ఓ వ్య‌క్తిపై ఓ వివాహిత ఫిర్యాదు చేయ‌డంతో దీనిపై విచారణ జ‌రిపిన హైకోర్టులోని నాగ్‌పుర్‌ ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చి, కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

పూర్తి వివ‌రాలు చూస్తే.. మ‌హారాష్ట్ర‌లోని అకోలాలోని ఓ కిరాణ దుకాణ యజమాని 2011లో త‌మ వ‌ద్దే పనిచేసే ఓ వివాహితకు ప్రేమలేఖ ఇవ్వడానికి ప్ర‌య‌త్నించాడు. అయితే, దాన్ని తీసుకునేందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ దుకాణ య‌జ‌మాని ఓ పేప‌ర్‌పై 'నిన్ను నేను ప్రేమిస్తున్నాను' అని రాసి ఆమెపైకి విసిరాడు. అంతేగాక‌, ఆ మరుస‌టి రోజు కూడా ఆ వివాహిత‌ను మళ్లీ అలాగే విసిగించాడు. తర్వాత ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు.

చివ‌ర‌కు బాధితురాలు అకోలాలోని సివిల్‌లైన్‌ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివ‌ర‌కు 2018 జూన్‌ 21న సెషన్స్‌ కోర్టు ఆ దుకాణ య‌జ‌మానికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.40 వేల జరిమానా విధించింది.

అయితే, సెష‌న్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించ‌డంతో దీనిపై విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మహిళపైనే దుకాణ య‌జ‌మాని ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. తన దుకాణంలో సరుకులు తీసుకుని డబ్బులు చెల్లించలేదని, తన డబ్బు చెల్లించాల‌ని అడిగినందుకే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసింద‌ని చెప్పుకొచ్చాడు.

అయితే, అత‌డు మ‌హిళ‌ను వేధించా‌డ‌న్న దానికి ఆధారాలు ఉన్నాయని చెబుతూ, సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. వివాహిత‌ను వేధించినందుకు ఆ దుకాణ య‌జ‌మాని అప్పటికే 45 రోజులు జైలుశిక్ష అనుభవించాడు. దీంతో శిక్షను ఏడాదికి తగ్గించి, జరిమానాను మాత్రం రూ.90 వేలకు పెంచుతూ, అందులో నుంచి రూ.85 వేలు బాధితురాలికి ఇవ్వాలంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఆ దుకాణ య‌జ‌మాని వివాహత ప‌ట్ల అలా ప్ర‌వ‌ర్తించ‌డం ఆమె నిబద్ధతను శంకించడమేనని హైకోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News