Rahul Gandhi: అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను లాక్ చేశాం: హైకోర్టుకు తెలిపిన ట్విట్టర్
- ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
- మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించి.. ట్వీట్ చేసిన రాహుల్
- రాహుల్ వల్ల మృతురాలి వివరాలు బయట ప్రపంచానికి తెలిశాయంటూ పిటిషన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను లాక్ చేశామని ఢిల్లీ హైకోర్టుకు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తెలిపింది. రాహుల్ షేర్ చేసిన హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల దళిత బాలిక కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను, దానికి సంబంధించిన ట్వీట్ ను కూడా తొలగించామని కోర్టుకు వెల్లడించింది.
ఆగస్ట్ 1న నైరుతి ఢిల్లీలోని ఓ శ్మశానవాటిక వద్ద బాలికను రేప్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే మృతురాలి తల్లిదండ్రులను రాహుల్ కలిశారు. తన కారులో కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఈ ట్వీట్, ఫొటోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాహుల్ ట్వీట్ కారణంగా అత్యాచారానికి గురైన బాలిక గురించి, ఆమె కుటుంబం గురించి అందరికీ తెలిసిపోయిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను ఓ సామాజిక కార్యకర్త వేశారు. అత్యాచారం కేసుల్లో బాధితుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేలా వ్యవహరించకూడదన్న విషయం తెలిసిందే.
మరోవైపు, ట్విట్టర్ తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ... సంస్థ నిబంధనలను రాహుల్ అతిక్రమించారని, అందువల్ల ఆయన ట్వీట్ ను ఇప్పటికే తొలగించామని హైకోర్టుకు తెలిపారు. ఆయన ట్విట్టర్ ఖాతాను కూడా లాక్ చేశామని చెప్పారు. ఈ అంశంలోకి ట్విట్టర్ ను పిటిషనర్ అనవసరంగా లాగారని అన్నారు. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు హైకోర్టు వాయిదా వేసింది.