Kerala: టీకా వేయించుకున్నా వదలని మహమ్మారి.. కేరళలో 40 వేల మందికిపైగా కరోనా!

Over 40 thousand Vaccinated People Test Positive In Kerala

  • ఆందోళన పరుస్తున్న తాజా కేసులు
  • వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా వదలని మహమ్మారి
  • నమూనాలు పంపాలంటూ కేరళను కోరిన కేంద్రం
  • రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందని ఆందోళన

కరోనా చెలరేగిపోతోంది. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేసుకున్నా వదలడం లేదు. కేరళలో వ్యాక్సిన్ వేయించుకున్న 40 వేల మందికిపైగా వ్యక్తులకు కరోనా సోకడం అధికారులను కలవరపరుస్తోంది. నిజానికి టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 40 వేల మందికిపైగా వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అంతేకాదు, వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తాజా కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఫలితంగా ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా? అన్ని విషయాన్ని కనుగొననుంది.

కొత్త వేరియంట్లు కొత్త వేవ్‌లకు కారణమవుతుంటాయి. అలా దేశంలో ఇటీవల పెద్ద ఎత్తున విరుచుకుపడిన సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంటే కారణమన్న సంగతి తెలిసిందే. అయితే, సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
 
ఇక, వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా బారినపడిన కేసుల్లో అత్యధిక శాతం పతనంథిట్ట జిల్లాలోనే నమోదయ్యాయి. వీరిలో రెండు డోసులు తీసుకున్నవారూ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలి డోసు తీసుకున్న వారిలో 14,974 మంది వైరస్ బారినపడగా, రెండు డోసులు తీసుకున్న వారు 5,042 మంది ఉన్నారు. కాగా, కేరళలో గత కొన్ని వారాలుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

  • Loading...

More Telugu News