Mammutti: భారత హాకీ జట్టు గోల్ కీపర్ ను సర్ ప్రైజ్ చేసిన మమ్ముట్టి
- టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టుకు కాంస్యం
- కీలకపాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేష్
- కొచ్చిలో శ్రీజేష్ నివాసానికి వచ్చిన మమ్ముట్టి
- శ్రీజేష్ ను అభినందించిన వైనం
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ సాధించింది 7 పతకాలే అయినా, వాటిలో కొన్ని చిరస్మరణీయ ఘట్టాలు ఉన్నాయి. ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ అంశంలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దేశానికి తొలి స్వర్ణం అందించగా, భారత హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఓ పతకం (కాంస్యం) సాధించింది. గత కొంతకాలంగా హాకీలో యూరోపియన్ జట్ల హవా నడుస్తున్న తరుణంలో భారత్ కూడా అదే తరహా ఆటతీరుతో టోక్యోలో అదరగొట్టింది. కాంస్యం కోసం పోరులో పటిష్ఠమైన జర్మనీని మట్టి కరిపించింది.
కాగా, ఈ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు విజయాల్లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర ఎనలేనిది. అనేక పర్యాయాలు గోల్ పోస్టు వద్ద ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలిచి భారత్ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. చారిత్రక విజయం సాధించి భారత్ చేరుకున్న శ్రీజేష్ కు సొంతగడ్డ కేరళలో అపూర్వ స్వాగతం లభించింది. అంతేకాదు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అంతటివాడు స్వయంగా శ్రీజేష్ నివాసానికి వచ్చి అభినందించడం విశేషం అని చెప్పాలి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మమ్ముట్టి కొచ్చిలోని శ్రీజేష్ ఇంటికి వచ్చారు. శ్రీజేష్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి మనస్ఫూర్తిగా అభినందించారు. శ్రీజేష్ కాంస్య పతకాన్ని చూసిన ముమ్మట్టి సంతోషం వ్యక్తం చేశారు.
మమ్ముట్టి రాకతో శ్రీజేష్ నివసించే కాలనీలో సందడి వాతావరణం నెలకొంది. కొన్ని వందల చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మమ్ముట్టి అంతటివాడు తన నివాసానికి వచ్చేసరికి శ్రీజేష్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపేందుకు వచ్చిన ఆ సూపర్ స్టార్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.