Justice Nariman: కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నారీమన్ పదవీ విరమణ

Supreme Court Judge Justice Nariman retires

  • చివరి రోజున సీజేఐతో కలిసి కోర్ట్ హాల్-1లో కూర్చున్న జస్టిస్ నారీమన్
  • న్యాయ వ్యవస్థకు ఆయన ఒక పిల్లర్ అని కొనియాడిన సీజేఐ
  • నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన వారిలో జస్టిస్ నారీమన్ ఐదవ వ్యక్తి 

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ ఈరోజు పదవీ విరమణ చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి ఆయనే కావడం గమనార్హం. తన పదవీ కాలంలో జస్టిస్ నారీమన్ ఎన్నో చారిత్రక తీర్పులను వెలువరించడంలో భాగస్వామి అయ్యారు. తన పదవీకాలం చివరిరోజైన ఈరోజు సీజేఐ ఎన్వీ రమణతో కలిసి కోర్టు హాల్ నంబర్-1లో కూర్చున్నారు. రిటైర్ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం ఆనవాయతీగా వస్తోంది.

జస్టిస్ నారీమన్ కు వీడ్కోలు పలికే కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మన బలమైన న్యాయ వ్యవస్థకు ఆయన కూడా ఒక పిల్లర్ అని కొనియాడారు. ఆయన రిటైర్ కావడంతో న్యాయ వ్యవస్థ ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక మేథావిని మిస్ అవుతుందని చెప్పారు. జస్టిస్ నారీమన్ ఎప్పుడూ సత్యం వైపే నిలబడ్డారని అన్నారు. తన కెరీర్లో మొత్తం 13,565 కేసులను నారీమన్ డీల్ చేశారని చెప్పారు.  

జస్టిస్ నారీమన్ హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. 35 ఏళ్ల పాటు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఫాలీ నారీమన్ కుమారుడే జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్. 37 ఏళ్ల వయసులోనే ఆయనను సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు గుర్తించింది. 2011లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఆయన పదవినందుకున్నారు. ఇక 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. భారత చరిత్రలో నేరుగా సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇంతవరకు ఎనిమిది మంది మాత్రమే నియమితులు కాగా, జస్టిస్ నారీమన్ వారిలో ఐదవ వ్యక్తి.

  • Loading...

More Telugu News