Om Birla: రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ భేటీ!
- ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- పలుమార్లు గందరగోళం
- సభ్యుల ఆందోళనలు
- ఘటనలపై చర్చించిన ఓం బిర్లా, వెంకయ్య
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపు నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. ఇటీవల ఉభయసభల్లోని ఘటనలపై ఇరువురు చర్చించారు. సభల్లో జరిగిన ఘటనలు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు స్పందిస్తూ, కొందరు ఎంపీల ప్రవర్తన మరీ ఆందోళనకరమని పేర్కొన్నారు. సభలో పరిధి దాటిన ప్రవర్తనను ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. బాధ్యులైన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈసారి పెగాసస్ అంశం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం అనైతికంగా నిఘా వేస్తోందంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి. పెగాసస్ సృష్టికర్త ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని కేంద్రం స్పష్టం చేసినా విపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. పలు బిల్లులకు సంబంధించిన అంశాలపైనా విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు.