Venkaiah Naidu: ఆ రెండూ నాకు రెండు కళ్లతో సమానం: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- అధికార, విపక్షాలు రెండూ నాకు సమానమే
- చట్ట సభలు ఉండేది చర్చలు, సంప్రదింపుల కోసమే
- బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించడంలో సభాపతి బలవంతం ఉండదు
పార్లమెంటులో అధికార, విపక్షాలు రెండూ తనకు సమానమేనని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. అవి రెండూ తనకు రెండు కళ్లతో సమానమని... రెండు కళ్లూ సరిగా ఉంటేనే చూపు స్పష్టంగా ఉంటుందని చెప్పారు. సభ సజావుగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత అధికార, విపక్ష సభ్యులపై ఉందని అన్నారు. చట్ట సభలు ఉండేది చర్చలు, సంప్రదింపుల కోసమేనని చెప్పారు. బయట జరిగే కొట్లాటలకు పార్లమెంటు వేదిక కాదని చెప్పారు.
పార్లమెంటులో చోటు చేసుకున్న అనుచిత ఘటనలపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించడంలో సభాపతి బలవంతం ఉండదని... సభ సమష్టిగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జులై 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, సాగు చట్టాల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టడంతో ఉభయసభలు వరుస వాయిదాలకే పరిమితమయ్యాయి. చివరకు షెడ్యూల్ కంటే ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి.