Gellu Srinivasa Yadav: హుజూరాబాద్ టీఆర్ఎస్దే.. సర్వేలు మాకే అనుకూలం: కేసీఆర్
- ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిసిన గెల్లు శ్రీనివాసయాదవ్
- కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని ధీమా
- టీఆర్ఎస్పై ప్రజాభిమానాన్ని చాటే గొప్ప అవకాశం వచ్చిందన్న కేసీఆర్
హుజూరాబాద్‌లో సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, ఈ ఉప ఎన్నిక అభివృద్ధి, సంక్షేమ పథకాల వ్యతిరేకులకు చెంపపెట్టు అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ నిన్న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తనకు టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, హుజూరాబాద్‌లో గెలిచి పార్టీ ప్రతిష్ఠను పెంచుతానని అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువ సత్తా చాటి గులాబీ జెండాను ఎగురవేయాలని శ్రీనివాసయాదవ్‌కు సూచించారు. టీఆర్ఎస్పై ప్రజాభిమానాన్ని తెలియజెప్పేందుకు వచ్చిన చక్కని అవకాశమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.