Komatireddy Venkat Reddy: మాకు చెప్పకుండానే ఇబ్రహీంపట్నం సభకు ఏర్పాట్లు.. రేవంత్‌పై సోనియాకు కోమటిరెడ్డి ఫిర్యాదు!
- రేవంత్ తీరుపై మాణికం ఠాగూర్ కూడా అసంతృప్తి
- సభను వాయిదా వేయాలని చెప్పినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కోమటిరెడ్డి
- సభావేదిక మార్పు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభ విజయవంతమైన నేపథ్యంలో, అదే ఊపుతో ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలోనూ ఇదే పేరుతో ఓ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో తమకు మాట మాత్రమైనా చెప్పలేదని పేర్కొంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ కూడా ఇదే విషయంలో రేవంత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు, ఇబ్రహీంపట్నం సభను వాయిదా వేయాలంటూ రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించతలపెట్టిన సభావేదిక స్థలంలో స్వల్ప మార్పు జరిగింది. తొలుత సాగర్ హైవే పక్కన పోలీస్ స్టేషన్ సమీపంలో సభ నిర్వహించాలని నిర్ణయించగా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో అవుటర్ రింగురోడ్డు పక్కన బొంగుళూరు సమీపంలో స్థలాన్ని పరిశీలిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు.