SpiceJet: స్పైస్ జెట్ విమానయాన సంస్థకు భారీ జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్

Consumer Forum fines SpiceJet

  • విమానం ఆలస్యంగా వస్తోందని టికెట్లు క్యాన్సిల్ చేయించిన సిబ్బంది
  • అప్పటికప్పుడు వేరే టికెట్లు బుక్ చేయించిన వైనం
  • రూ. 29,975 అదనంగా ఖర్చయ్యాయంటూ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించిన వినియోగదారుడు

టికెట్లను రద్దు చేయించి వినియోగదారుడికి ఆర్థికనష్టం, వేదనను కలిగించినందుకు విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన జంధ్యాల సూర్యనారాయణ, జంధ్యాల భారతిలు హైదరాబాద్-ఢిల్లీ-శ్రీనగర్ వెళ్లేందుకు 2018 అక్టోబర్ 31న మేక్ మై ట్రిప్ ద్వారా స్పైస్ జెట్ విమాన టికెట్లు, అక్కడి హోటల్ ను బుక్ చేసుకున్నారు. అయితే, విమానం ఆలస్యంగా వస్తోందని... ఈ టికెట్లను క్యాన్సిల్ చేసుకుని, గో-ఐబిబో ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని స్పైస్ జెట్ సిబ్బంది వారికి సూచించారు. దీంతో, సిబ్బంది చెప్పినట్టుగానే వారు చేశారు.

అయితే, అప్పటికప్పుడు మళ్లీ టికెట్లను బుక్ చేసుకోవడం వల్ల తమకు అదనంగా రూ. 29,975 ఖర్చయ్యాయని... స్పైస్ జెట్ సంస్థ నుంచి తమకు పరిహారం ఇప్పించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ను సూర్యనారాయణ ఆశ్రయించారు. విచారణ సందర్భంగా వినియోగదారుడి వాదనతో కమిషన్ ఏకీభవిస్తూ, స్పైస్ జెట్ కు భారీ జరిమానా విధించింది.

రూ. 29,975ను 9 శాతం వడ్డీతో వినియోగదారుడికి చెల్లించాలని... దీంతోపాటు వారు అనుభవించిన వేదనకు పరిహారంగా రూ. 20 వేలు, కేసు ఖర్చుల కింద రూ. 5 వేలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను పాటించినందుకు గాను వినియోగదారుడికి రూ. లక్ష చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి మరో లక్ష రూపాయలు చెల్లించాలని తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News