Andhra Pradesh: ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు
- కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు
- తరగతి గదిలో 20 మందికి మించకుండా విద్యార్థులు
- తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తీసుకుని బడులకు వెళ్లాలి
- మాస్కులు తప్పనిసరిగా ధరించాలని విద్యాశాఖ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణతో మూతపడ్డ పాఠశాలలు ఈ రోజు నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని విద్యా శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. అన్ని పాఠశాలల్లో తరగతి గదిలో 20 మందికి మించకుండా విద్యార్థులను కూర్చోబెట్టాల్సి ఉంటుంది.
అలాగే, ఇంటి నుంచి వచ్చేటప్పుడే విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తీసుకుని పాఠశాలలకు వెళ్లాలి. విద్యార్థులతో పాటు టీచర్లు, ఇతర సిబ్బంది మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో అన్ని బడుల పరిసరాల్లో శానిటైజ్ చేయించారు. విద్యార్థులు తరగతి గదుల్లోకి ప్రవేశించే ముందు వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
కరోనా లక్షణాలు ఉంటే తిరిగి ఇళ్లకు పంపుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులు పాఠశాలలకు రాకుండా టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే సమయంలోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లోనూ కరోనా జాగ్రత్తలపై ఒక పీరియడ్లో అవగాహన తరగతి నిర్వహిస్తారు.