Afghanistan: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోసం చేశారు: శ్వేతసౌధం ముందు ఆఫ్ఘన్ పౌరుల నిరసన
- అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు
- పలు దేశాలకు వెళ్తున్న ఆఫ్ఘన్లు
- పలు దేశాల అధినేతలపై ఆఫ్ఘన్ వాసుల మండిపాటు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సహా నాటో దళాలన్నీ వెనక్కి వెళ్తుండడంతో తాలిబన్లు రెచ్చిపోతోన్న విషయం తెలిసిందే. దేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆఫ్ఘన్ ప్రజలు ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఇప్పటికే అమెరికా, భారత్ వంటి దేశాలకు కొందరు చేరుకున్నారు. అమెరికాలోని శ్వేతసౌధం ముందు ఆఫ్ఘన్ కు చెందిన కొందరు నిరసన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమను మోసం చేశారని, ఆఫ్ఘన్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలకు ఆయనే బాధ్యతని వారు నినాదాలు చేశారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్ల బారి నుంచి రక్షించాలన్నారు.
కాగా, ఢిల్లీలోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పలువురు ఆఫ్ఘన్ యువకులు ప్రపంచ దేశాల అధినేతలతో పాటు ఇన్నాళ్లు ఆఫ్ఘన్‌ను పాలించిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీపై మండిపడ్డారు. కాబూల్‌లోకి తాలిబన్లు ప్రవేశించడంతో అష్రఫ్ ఘనీ ఆ దేశాన్ని విడిచివెళ్లిన విషయం తెలిసిందే. 'దేశాన్ని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ విడిచి వెళ్లడం బాధ్యతారాహిత్య చర్య. ఆయన తీరు ఆఫ్ఘన్ ప్రజలను చాలా బాధించింది. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశారు' అని కాబూల్ నుంచి ఢిల్లీ చేరుకున్న అబ్దుల్ మసూదీ అనే యువకుడు చెప్పాడు.