Guntur District: గుంటూరులో బీటెక్ విద్యార్థిని మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న నేతలు
- ముగిసిన పోస్టుమార్టం
- మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యుల ఏర్పాట్లు
- అడ్డుకుని ఆందోళనకు దిగిన టీడీపీ, వామపక్షాల కార్యకర్తలు
- కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్
గుంటూరు కాకాని రోడ్డులో బీటెక్ అమ్మాయి రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఈ రోజు పోస్టుమార్టం, తదుపరి ప్రక్రియ ముగిశాయి. దీంతో ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకోగా, వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుపడ్డారు.
దీంతో జీజీహెచ్ వద్ద గందరగోళం నెలకొంది. యువతిని చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి వద్దే టీడీపీతో పాటు వామపక్షాల నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో మృతదేహాన్ని మరో మార్గం ద్వారా తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, ఈ రోజు ఉదయం రమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. రమ్యను హత్య చేసిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని ఆమె కుటుంబ సభ్యులు చరితను కోరారు.