Amaraja Batteries: అమరరాజా బ్యాటరీస్‌లో పీసీబీ, ఐఐటీ మద్రాస్ నిపుణుల తనిఖీ నివేదికను సమర్పించండి: ఏపీపీసీబీని ఆదేశించిన హైకోర్టు
- ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతాన్ని పరీక్షించేందుకు పీసీబీకి సహకరించాలంటూ కంపెనీకి సూచన
- స్టే ఉత్తర్వులు మరో ఆరు వారాల పొడిగింపు
- కాలుష్య నియంత్రణతోపాటు ఉద్యోగాలు కూడా అంతే ముఖ్యమన్న హైకోర్టు ధర్మాసనం
అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలో ఇటీవల పీసీబీ అధికారులు, మద్రాస్ ఐఐటీ నిపుణులు చేపట్టిన తనిఖీ నివేదికను కోర్టు ముందు ఉంచాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం నిన్న ఆదేశించింది. అలాగే, పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతాన్ని పరీక్షించేందుకు పీసీబీకి సహకరించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరింది. పరిశ్రమను మూసివేస్తున్నట్టు పీసీబీ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మరో ఆరు వారాలపాటు పొడిగించింది.
కాలుష్య నియంత్రణ అవసరమేనని అభిప్రాయపడిన కోర్టు.. ఉద్యోగాలు కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించింది. అమరరాజా బ్యాటరీస్ పెద్ద పరిశ్రమ అని, అందులో చాలామంది ఉద్యోగులు పనిచేస్తుండడంతో స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఈ వ్యవహారాలకు సంబంధించి మీడియాతో మాట్లాడకుండా పీసీబీ సభ్య కార్యదర్శి, ఇతర అధికారులకు సూచించాలని సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది.