KCR: అసలు మీకు మనసంటూ ఉందా?: కేసీఆర్‌పై షర్మిల మండిపాటు
- దయచేసి నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోకండి
- మీ పక్షాన నేను నిలబడ్డాను, కొట్లాడుతున్నాను
- కేసీఆర్ గారి కొలువుల ఆటకు తమ్ముడు నగేశ్ బలి అయ్యాడు
- ఉద్యోగాలపై స్పష్టత లేని హామీలతో రోజుకో విద్యార్థిని చంపుతున్నాడు
తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఈ రోజు మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలం గుండెంగ గ్రామంలో దీక్షకు దిగారు. అంతకు ముందు సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగం రాక మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండి మండలంలోని పొనగల్లు వాసి యాపచెట్టి నగేశ్ (24) బలవన్మరణానికి పాల్పడిన ఘటనను ప్రస్తావించారు.
'దయచేసి నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. మీ పక్షాన నేను నిలబడ్డాను, కొట్లాడుతున్నాను. మీ అక్కగా మీకు అండగా మీ పోరాటాన్ని భూజానేసుకొని ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్ష చేస్తున్నాను. అధైర్యపడకండి, కేసీఆర్ ముక్కుపిండి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇప్పిస్తా' అని షర్మిల పేర్కొన్నారు.
'కేసీఆర్ గారి కొలువుల ఆటకు తమ్ముడు నగేశ్ బలి అయ్యాడు. ఉద్యోగాలపై స్పష్టత లేని హామీలతో రోజుకో విద్యార్థిని చంపుతున్నాడు. ఆగస్టు 15న ఉద్యోగ ఖాళీల భర్తీపై క్లారిటీ ఇస్తారని ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. అసలు మీకు మనసంటూ ఉందా? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికేషన్స్ ఇస్తారు?' అని షర్మిల నిలదీశారు.