Taliban: తాలిబన్లలో మలయాళీలు ఉన్నారన్న శశిథరూర్.. వివాదాస్పదమైన ట్వీట్
- తాలిబన్ల వీడియోపై స్పందించిన కాంగ్రెస్ నేత
- వీడియోలోని మాటలపై విశ్లేషణ
- తప్పుబట్టిన బీజేపీ నేతలు
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత కాబూల్ శివార్లలో ఒక ఘటన జరిగింది. అక్కడకు చేరుకున్న కొందరు తాలిబన్ ఫైటర్లలో ఒకడు తాము విజయం సాధించామనే ఆనందంలో నేలపై కూర్చొని ఆనందబాష్పాలు రాల్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
దీన్ని చూసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తాలిబన్లలో కనీసం ఇద్దరు మలయాళీలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వీడియోలో ఒకడు ‘సంసరికెట్టె’ అన్నాడని, దాన్ని మరొకడు అర్థం చేసుకున్నాడని శశిథరూర్ విశ్లేషించారు. అయితే ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాలిబన్లతో మలయాళీలను ముడిపెట్టడం సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
కేరళను తాలిబన్ ఉగ్రవాదులతో ముడిపెట్టడం సరికాదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ నేత వినీత్ గోయెంకా కూడా స్పందించారు. ఇదేమీ కామెడీ షో కాదంటూ శశిథరూర్‌కు కౌంటర్ ఇచ్చిన ఆయన.. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి స్యూడో సెక్యులరిజాన్ని వ్యాపింపచేస్తున్నాయని విమర్శించారు. తను ఇటీవల రాసిన 'ఎనిమీస్ వితిన్' పుస్తకంలో కేరళ ఎలా ఇస్లామిక్ ఉగ్రవాదుల హాట్‌స్పాట్‌గా మారుతుందనే అంశాన్ని వివరించానని చెప్పారు.