Allari Subhashini: నేను క్యాన్సర్ తో బాధపడుతుంటే సీఎం కేసీఆర్ ఆదుకున్నారు: 'అల్లరి' సుభాషిణి
- ఓ టీవీ షోలో పాల్గొన్న సుభాషిణి
- సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు
- జీవితాంతం రుణపడి ఉంటానని వ్యాఖ్య
- కొంతకాలం కిందట క్యాన్సర్ బారినపడిన నటి
- రూ.15 లక్షలు సాయం అందించిన కేసీఆర్
అల్లరి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న నటి సుభాషిణి. అయితే సుభాషిణి కొంతకాలం కిందట ప్రాణాంతక క్యాన్సర్ బారినపడ్డారు. చికిత్సకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. 'అల్లరి' సుభాషిణి పరిస్థితి పట్ల సీఎం కేసీఆర్ పెద్దమనసుతో స్పందించి రూ.15 లక్షలు అందించారు. అటు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స జరిగింది.
ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో 'అల్లరి' సుభాషిణి సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తాను క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఆదుకున్నారని, ఆయనకు జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తనకు మా సభ్యులు రూ.1 లక్ష అందించారని, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడుతోందని, ఇకపై సినిమాల్లో నటిస్తానని వెల్లడించారు. తనకు ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
'అల్లరి' సుభాషిణి అసలు పేరు తిరుమల సుభాషిణి. బాల్యం నుంచే నాటకాల్లో నటిస్తూ నటనపై మక్కువ పెంచుకున్నారు. 'చింతామణి' నాటకంలో నటిస్తుండగా, దర్శకుడు రవిబాబు ఆమెను చూసి తన 'అల్లరి' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అక్కడ్నించి సుభాషిణి... 'అల్లరి' సుభాషిణి అవడమే కాకుండా, వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు అందరు అగ్రహీరోల సినిమాల్లోనూ నటించారు. లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.