Supreme Court: సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ రమణ అసహనం

CJI NV Ramana Expresses Anger Over Judges Appointments News

  • కొలీజియం ప్రకటించకుండానే వార్త రాయడమా?
  • మీడియా మిత్రులు నియామకాల పవిత్రతను కాపాడాలి
  • ఇలాంటి వార్తల వల్ల చెడు జరిగే ప్రమాదం ఎక్కువ

సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలకు సంబంధించి కొలీజియం సిఫార్సుల వార్తలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను రాసేటప్పుడు మీడియా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కొలీజియం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడకముందే ఇలా వార్తలు రాయడం వల్ల చెడు జరిగే ప్రమాదం ఉందన్నారు.

‘‘జడ్జిల నియామక ప్రక్రియ అంటే ఎంతో పవిత్రమైనది. దానికంటూ ఓ గొప్పతనం ఉంది. కాబట్టి మీడియా మిత్రులంతా ఆ ప్రక్రియ పవిత్రతను కాపాడాలని కోరుతున్నా’’ అని ఆయన అన్నారు. జస్టిస్ నవీన్ సిన్హా వీడ్కోలు సభ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గొప్ప స్థాయికి ఎదగాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారని, అయితే, ఇలాంటి బాధ్యతారహితమైన వార్తల వల్ల అలాంటి వారి కెరీర్ నష్టపోయిన దాఖలాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు.

ఇలాంటి వార్తలు రాయడం దురదృష్టకరమన్నారు. ఇంతటి సీరియస్ వ్యవహారాన్ని ప్రసారం చేయని సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలను అభినందిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం జడ్జిల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే దానిపై సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలుగా తొమ్మిది మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసిందని, అందులో ముగ్గురు మహిళా జడ్జిలున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News