Telangana: దళితబంధు పథకంపై విచారణ: తెలంగాణ సర్కారుపై హైకోర్టు అసహనం

Place GOs in The Govt Websites High Court Asks Telangana Government

  • నిబంధనల జీవోను వెబ్ సైట్ లో పెట్టలేదన్న పిటిషనర్  
  • ప్రజలకు అందుబాటులో ఉంచితే ఇబ్బందేంటని ప్రశ్న
  • వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్న కోర్టు 

ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండేలా వెబ్ సైట్ లో పెట్టడానికి వచ్చిన ఇబ్బందేంటని తెలంగాణ సర్కారును హైకోర్టు నిలదీసింది. జీవోను ఇచ్చిన 24 గంటల్లోగా దాని కాపీని వెబ్ సైట్ లో పెట్టాల్సిందిగా ఆదేశాలిచ్చింది. యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళితబంధు పథకం అమలుపై దాఖలైన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. పథకానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని ఆరోపిస్తూ ‘వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్’ అనే సంస్థ వేసిన ఆ పిటిషన్ ను.. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం విచారించింది.

పేద దళితులందరికీ పథకం వర్తిస్తుందని, దానికి సంబంధించి ఇప్పటికే నిబంధనలను ఖరారు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆ నిబంధనలను వ్యాజ్యంలో ఎందుకు పేర్కొనలేదంటూ పిటిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. నిబంధనల జీవోను వెబ్ సైట్ లో పెట్టలేదని కోర్టుకు పిటిషనర్ వివరించారు. దీంతో ఆ జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికొచ్చిన ఇబ్బందేంటని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. వాటిని  ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంటూ, ఆ పిటిషన్ విచారణను ముగించింది. 

  • Loading...

More Telugu News