Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిలుగా తొమ్మిది మంది పేర్లను సిఫారసు చేసిన కొలీజియం.. జాబితాలో ముగ్గురు మహిళలు!
- జాబితాలో సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ పేరు
- బార్ అసోసియేషన్ నుంచి నేరుగా అవకాశం దక్కించుకున్న తొమ్మిదో న్యాయవాది నరసింహ
- నరసింహ తెలుగు వ్యక్తి కావడం గమనార్హం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మిది మంది పేర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం.
జాబితాలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎం సుందరేశ్, గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో పాటు సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ ఉన్నారు.
పీఎస్ నరసింహ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన తెలుగువారు కావడం గమనార్హం. బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా అవకాశం దక్కించుకున్న తొమ్మిదో న్యాయవాదిగా నరసింహ నిలవనున్నారు.