delta: వ్యాక్సిన్‌తో డెల్టా వేరియంట్‌కూ అడ్డుకట్ట.. తేల్చి చెప్పిన పరిశోధకులు
- డెల్టా వేరియంట్‌ను నిరోధించడంలో ప్రతిరక్షకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి
- వాటి నుంచి డెల్టా వేరియంట్ తప్పించుకోలేకపోతోంది
- మొత్తం 13 యాంటీబాడీలను తీసుకుని పరిశోధనలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ విజృంభణతో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ వేరియంట్ తో ముప్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, వ్యాక్సిన్ తీసుకుంటే డెల్టా వేరియంట్ కూడా ఏమీ చేయలేదని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు చెబుతున్నారు.
అందుకుగల కారణాలను కూడా వారు విశ్లేషించి చెప్పారు. డెల్టా వేరియంట్‌ను నిరోధించడంలో ప్రతిరక్షకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వాటి నుంచి డెల్టా వేరియంట్ తప్పించుకోలేకపోతోందని వివరించారు. మొత్తం 13 యాంటీబాడీలను తీసుకుని తాము పరిశోధనలు జరిపామని తెలిపారు. ప్రమాదకరంగా మారిన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లను యాంటీబాడీలపై ప్రయోగించామని చెప్పారు.
ఈ 13 యాంటిబాడీల్లో 12 యాంటీబాడీలు ఆల్ఫా, డెల్టా వేరియంట్లను గుర్తించి నిరోధించాయని తెలిపారు. అలాగే, కరోనా నాలుగు వేరియంట్లనూ 8 కణాలు విజయవంతంగా గుర్తించాయని చెప్పారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌తో శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ప్రమాదకర డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాయని తేల్చామని వివరించారు.