DRDO: భారత యుద్ధ విమానాలకు 'చాఫ్' కవచం... డీఆర్డీవో ఆవిష్కరణ

DRDO develops new chaff technology for Indian fighter jets
  • ఇటీవల నేవీకి చాఫ్ అప్పగింత
  • అన్ని రకాలుగా పరీక్షించిన నేవీ
  • తాజాగా వాయుసేనకు చాఫ్ టెక్నాలజీ
  • శత్రు రాడార్లు, క్షిపణులను ఏమార్చే సాంకేతికత
భారత రక్షణ రంగ అవసరాలను తీర్చడం కోసం అమోఘమైన రీతిలో పరిశోధనలు చేపడుతున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తాజాగా భారత వాయుసేన కోసం చాఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధ విమానాలను గుర్తించడం ప్రత్యర్థి రాడార్లకు సాధ్యపడదు. కొన్నినెలల కిందటే ఈ చాఫ్ టెక్నాలజీని డీఆర్డీవో భారత నావికాదళానికి అందించింది. ఇది మూడు వెర్షన్లలో ఉంటుంది. అన్ని వెర్షన్లను నేవీ ఇప్పటికే పరీక్షించింది.

తాజాగా డీఆర్డీవో వర్గాలు వాయుసేన అవసరాలను దృష్టిలో ఉంచుకుని చాఫ్ టెక్నాలజీ సరికొత్త వెర్షన్ ను అభివృద్ధి చేశారు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు రాజ్యమేలుతున్న తరుణంలో చాఫ్ ఓ కవచంలా భారత యుద్ధ విమానాలను కాపాడుతుందని డీఆర్డీవో పేర్కొంది. ఇది ప్రత్యర్థి రాడార్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను గుర్తించి వాటిని విజయవంతంగా అడ్డుకుంటుంది. అంతేకాదు, దూసుకువచ్చే క్షిపణులను సైతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తప్పుదోవ పట్టిస్తుంది. శత్రు అస్త్రాలను దారిమళ్లించి నష్టం జరగకుండా చూస్తుంది.

డీఆర్డీవో ఈ సాంకేతికతను పూణేలోని తన అనుభంధ సంస్థ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (హెచ్ఈఎంఆర్ఎల్) సాయంతో అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీలో భాగంగా వినియోగించే పరికరాలను భారత్ లోనే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీవో వర్గాలు పరిశ్రమలకు బదలాయించాయి.
DRDO
Chaff Technology
Fighter Jets
IAF
India

More Telugu News