Donald Trump: ముందే మన స్థావరాలపై బాంబులు వేసేస్తే సరిపోయేది!: ఆఫ్ఘన్‌లో పరిస్థితులపై ట్రంప్ వ్యాఖ్యలు
- ఆఫ్ఘన్‌లో అమెరికా మిలటరీ స్థావరాలు తాలిబన్ల చేతుల్లోకి
- ముందుగా అమెరికా సైనికులను వెనక్కి రప్పించకపోతేనే బాగుండేదన్న ట్రంప్
- మొదట ఆయుధాలన్నింటినీ తరలించాల్సిందని వ్యాఖ్య
- ఆ తర్వాత మిలటరీ స్థావరాపై బాంబు వేయాల్సిందని అభిప్రాయం
ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా మిలటరీ స్థావరాలు, ఆయుధాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతోన్న విషయం తెలిసిందే. దీంతో ఆఫ్ఘన్‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మిలటరీ స్థావరాలపై బాంబులు వేస్తే బాగుండేదని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న అమెరికా పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కొన్ని చర్యలు తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆఫ్ఘన్‌లో ముందుగా అమెరికా దళాలను వెనక్కి రప్పించకుండా మొదట అమెరికా పౌరులను, అనంతరం ఆయుధాలను తరలించాల్సిందని చెప్పారు.
ఆ తర్వాత అమెరికా సైనిక స్థావరాలపై బాంబులు వేస్తే బాగుండేదని తెలిపారు. ఈ పనులన్నీ చేసిన తర్వాత అమెరికా మిలటరీని వెనక్కి తీసుకురావాల్సిందని చెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. సైనికులను చివరిగా తరలిస్తే వారి ప్రాణాలకు ముప్పు ఉండదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.