Nara Lokesh: మంత్రి, ఎమ్మెల్యేగా ఉన్నవారు మహిళలతో అగౌరవంగా మాట్లాడుతుండటం దురదృష్టకరం: నారా లోకేశ్
- మహిళలను గౌరవించే తత్వానికి ప్రతీక రాఖీ పౌర్ణమి
- ప్రతి మహిళకు అన్నగా నిలవడం అందరి బాధ్యత
- మంత్రి స్థానంలో ఉన్నవారు కూడా మహిళలతో దారుణంగా మాట్లాడుతున్నారు
రక్షాబంధన్ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సాంప్రదాయానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని ఆయన అన్నారు. తోడబుట్టిన అక్కాచెల్లెళ్లకే కాకుండా సమాజంలో ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా నిలవడం అందరి బాధ్యత అని చెప్పారు. ఇది మనందరి కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెపుతోందని అన్నారు.
ఈరోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్నవారు కూడా మహిళలతో దారుణంగా మాట్లాడుతున్నారని... ఇది చాలా దురదృష్టకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏపీలో మహిళలపై అనునిత్యం దారుణాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఒక అన్నగా స్పందిస్తానని తెలిపారు. ఉన్మాదుల దుశ్చర్యలకు బలైపోయిన ప్రతి ఆడపిల్లకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తానని చెప్పారు.