Afghanistan: ఆఫ్ఘన్ ప్రజలకు ద్వారాలు తెరిచిన దేశాలు ఇవే!

These nations welcomes Afghans who fled from Taliban regime

  • ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ పాలన
  • దేశాన్ని వీడుతున్న ప్రజలు
  • సాయపడుతున్న అమెరికా, నాటో దళాలు
  • ఆశ్రయం ఇస్తున్న పలు దేశాలు

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల హవా మళ్లీ మొదలైందన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి అమెరికా, నాటో దళాలు సాయం చేస్తున్నాయి. అయితే అత్యధిక శాతం ప్రజలు దేశం నుంచి ఎలా బయటపడాలో తెలియక కుమిలిపోతున్నారు. గతంలో తాలిబన్ల కర్కశత్వాన్ని రుచిచూసిన ఆఫ్ఘన్ ప్రజలు, మరోసారి ఆ కిరాతకపు పాలన అని తెలియగానే ఇతర దేశాల వైపు ఆశగా చూస్తున్నారు.

ఈ క్రమంలో ఆఫ్ఘన్ నుంచి పారిపోయి వచ్చేసిన వారికి అనేక దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఇప్పుడే కాదు, ఆఫ్ఘన్ ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా దేశం విడిచి వెళ్లిపోతూనే ఉన్నారు. ఇప్పటిదాకా 2.6 మిలియన్ల ఆఫ్ఘన్ శరణార్థుల్లో 90 శాతం మందికి పాకిస్థాన్, ఇరాన్ ఆశ్రయం కల్పించాయని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం హైకమిషనర్ షబియా మాంటూ తెలిపారు.

ఇటీవల పరిణామాల నేపథ్యంలో అమెరికాకు ఇప్పటివరకు 1,200 మంది ఆఫ్ఘన్లను తరలించగా, మరికొన్ని వారాల్లో వారి సంఖ్య 3,500కి పెరగొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే 20 వేల మంది ఆఫ్ఘన్లకు పునరావాసం కల్పిస్తున్న కెనడా కూడా, ఆ సంఖ్యను మరింత పెంచేందుకు సుముఖంగా ఉంది.

బ్రిటన్ సైతం తాలిబన్ల పంజా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘన్లను స్వాగతించాలని భావిస్తోంది. 5 వేల మంది ఆఫ్ఘన్లకు ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రధానంగా మహిళలు, చిన్నారులకు ఆశ్రయం కల్పించాలన్నది బ్రిటన్ ప్రభుత్వ ఆలోచన.

ఇక, భారత్ గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ కు నమ్మకమైన మిత్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు కూడా తన సొంత గడ్డ మ్యాచ్ లను భారత్ లోనే ఉండి ఆడుతుంది. తాజాగా తాలిబన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ ఆఫ్ఘన్లకు పెద్దమనసుతో ద్వారాలు తెరిచింది. ఆఫ్ఘన్లు దౌత్యకార్యాలయాలకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా) కార్యక్రమం షురూ చేసింది. ఇ-వీసాలతో భారత్ లో ప్రవేశించే ఆఫ్ఘన్లు ఆర్నెల్ల పాటు ఉండొచ్చు.

అటు, నార్త్ మాసిడోనియా, ఉగాండా, అల్బేనియా అండ్ కొసావో వంటి దేశాలు ఆఫ్ఘన్లను అక్కున చేర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News