Afghan Woman: ఆఫ్ఘన్ మహిళకు ప్రసవపు నొప్పులు రావడంతో హుటాహుటీన అమెరికా విమానం ల్యాండింగ్
- దేశాన్ని వీడుతున్న ఆఫ్ఘన్లు
- తాలిబన్ పాలన పట్ల భయాందోళనలు
- అమెరికా సైనిక విమానం ఎక్కిన ఆఫ్ఘన్ మహిళ
- పండంటి ఆడశిశువుకు జననం
తాలిబన్ పాలన అంటేనే వణికిపోతున్న ఆఫ్ఘన్ ప్రజలు కట్టుబట్టలతోనైనా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెరికా సైనిక రవాణా విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్ శనివారం నాడు ఆఫ్ఘన్ ప్రజలతో బయల్దేరింది. విమానం ఎక్కినవారిలో ఓ గర్భవతి కూడా ఉంది. అయితే మార్గమధ్యంలో ఆ మహిళకు ప్రసవపు నొప్పులు మొదలయ్యాయి.
అప్పటికే విమానం గాల్లో 28 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తోంది. విమానంలో పీడనం తక్కువగా ఉండడంతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురైంది. దాంతో ఆ ఫ్లయిట్ కమాండర్ సమయస్ఫూర్తితో స్పందించి విమానాన్ని తక్కువ ఎత్తుకు తీసుకురావాలని నిర్ణయించారు. దాంతో విమానంలో పీడనం సాధారణ స్థితికి చేరుకుంది.
అనంతరం ఆ సీ-17 విమానాన్ని జర్మనీలోని అమెరికా వాయుసేనకు చెందిన రామ్ స్టీన్ ఎయిర్ బేస్ లో దించారు. అప్పటికే సమాచారం అందించడంతో, ఆరోగ్య బృందం సిద్ధంగా ఉంది. ఆ మహిళకు సకాలంలో వైద్య చికిత్స అందించడంతో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆపై తల్లీబిడ్డలను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిరువురు ఆరోగ్యంగా ఉన్నట్టు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి.