TTD: అగర్ బత్తీలు తయారుచేస్తున్న టీటీడీ... వచ్చే నెలలో అమ్మకాలు!
- శ్రీవారి కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలు
- పెద్దఎత్తున పూల వ్యర్థాలు
- వాటినుంచి అగర్ బత్తీలు
- భక్తులకు అమ్మాలని టీటీడీ నిర్ణయం
తిరుమల శ్రీవారికి నిత్యం టన్నుల కొద్దీ పూలను వివిధ రకాల అలంకరణల్లోనూ, కైంకర్యాల్లోనూ ఉపయోగిస్తుంటారు. వాటిని ఒకరోజు తర్వాత తొలగిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త కార్యాచరణ చేపట్టింది. పూల వ్యర్థాల నుంచి సుగంధ భరితమైన అగర్ బత్తీలు తయారు చేస్తోంది. మొత్తం 7 రకాల అగర్ బత్తీలు ఉత్పత్తి చేస్తున్న టీటీడీ... వాటిని వచ్చే నెల నుంచి భక్తులకు విక్రయించనుంది.
ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని తిరుమల కొండపై ఉన్న లడ్డూ కౌంటర్లు, గోశాల, కొబ్బరికాయల కౌంటర్ లోనూ, తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం వద్ద, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద విక్రయించనున్నారు.
అటు, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ సంస్థతో కలిసి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు తయారుచేయనుంది. దీనికి సంబంధించిన అంశాలను కూడా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి నేడు సమీక్షించారు.