Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ముద్దుగుమ్మ
- విజయదశమికి అఖిల్, పూజహెగ్డే సినిమా
- కంగన 'తలైవి'కి విడుదల తేదీ ఖరారు
* కథానాయిక శ్రుతిహాసన్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్' యాక్షన్ చిత్రంలో శ్రుతి కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఇందులో ఆమె కొన్ని ఫైట్స్ కూడా చేస్తుందట. అందుకని మార్షల్ ఆర్ట్స్ లో ఆమెకు ప్రస్తుతం శిక్షణనిప్పిస్తున్నారు.
* బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించారు. అక్టోబర్ 12న కానీ 13న కానీ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఇందులో పూజహెగ్డే కథానాయికగా నటించింది.
* బాలీవుడ్ భామ కంగన రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన 'తలైవి' చిత్రాన్ని సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.