Bombay High Court: కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాంబే హైకోర్టు
- సీఎం థాకరేపై వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి రాణే
- అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు
- అంతకుముందు కోర్టును ఆశ్రయించిన రాణే
- పిటిషన్ తిరస్కరణ
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను చెంప పగలగొట్టాలంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అరెస్ట్ కాకముందు బాంబే హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని నారాయణ్ రాణే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ ను తక్షణమే నమోదు చేసుకుని, ఇప్పటికిప్పుడు విచారించాలంటూ విజ్ఞప్తి చేశారు.
అయితే, ఎస్ఎస్ షిండే, ఎన్జే జమాదార్ లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. "మీరు కోర్టు విధివిధానాలను పాటించాల్సిందే. ఓ దరఖాస్తును విచారణల జాబితాలో మొదట చేర్చాలని కోరడం నిబంధనల్లో ఎక్కడా లేదు. మీ తీరు చూస్తుంటే మమ్మల్ని రిజిస్ట్రీ విధులు నిర్వర్తించమని కోరుతున్నట్టుంది. అత్యవసర విచారణ జరపాలని కోరుతూ మీరు దరఖాస్తు చేసుకోవాల్సింది రిజిస్ట్రీ వద్ద. అప్పుడు మేం మీ దరఖాస్తును పరిశీలిస్తాం. ఈ విధానానికి ఎవరూ మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరికీ ఇదే వర్తిస్తుంది. రిజిస్ట్రీ చేయాల్సిన పనులు మాతో చేయించవద్దు" అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, విచారణ అనంతరం నారాయణ్ రాణే పిటిషన్ ను తిరస్కరించింది.
కాగా, సీఎం ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేను క్యాబినెట్ నుంచి తొలగించాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అసభ్యకరమైన భాషతో తన స్థాయికి దిగజారి వ్యవహరించారని రౌత్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాణే సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని వ్యాఖ్యానించారు.