Fees: ఏపీలో ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు ఫీజులు నిర్ధారించిన ప్రభుత్వం
- ఈ ఏడాది ఆన్ లైన్ లో ఇంటర్ ప్రవేశాలు
- పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో వేర్వేరు ఫీజులు
- తాజా ఫీజులు మూడేళ్ల పాటు వర్తింపు
- పాఠశాలలకూ ప్రాంతాల వారీగా ఫీజులు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు ఫీజులు నిర్ధారించింది. గ్రామ పంచాయతీల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో సైన్స్ గ్రూపులకు రూ.15 వేలు ఫీజుగా నిర్ణయించారు. ఆర్ట్స్ గ్రూపులకు రూ.12 వేలు ఫీజు నిర్ణయించారు. పురపాలక సంఘాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో సైన్స్ గ్రూపులకు రూ.17,500, ఆర్ట్స్ గ్రూపులకు రూ.15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక, నగరపాలక సంస్థల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో సైన్స్ గ్రూపులకు రూ.20 వేలు, ఆర్ట్స్ గ్రూపులకు రూ.18 వేలు ఫీజుగా నిర్ణయించారు. ఈ ఫీజులు వచ్చే మూడేళ్ల పాటు వర్తిస్తాయని రాష్ట్ర పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అటు, స్కూళ్లకు నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఫీజులు ఖరారు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.10,000, హైస్కూల్ విద్యకు రూ.12,000.... పురపాలక పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.11,000, హైస్కూల్ విద్యకు రూ.15,000... కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.12,000, హైస్కూల్ విద్యకు రూ.18,000 ఫీజు నిర్ణయించారు.