Hardeep Singh Puri: అప్పటికీ.. ఇప్పటికీ పెట్రోల్ సుంకాలు ఏమీ మారలేదు: కేంద్ర మంత్రి సమర్థన
- 2010లో లీటర్ పెట్రోల్ పై రూ.32.. ఇప్పుడూ అంతే
- ఆ ఆదాయంతో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి
- కొన్ని నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం
పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న సుంకాలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమర్థించుకున్నారు. లీటర్ చమురుపై కేంద్రం రూ.32 సుంకాన్ని విధిస్తోందని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ సంక్షేమ పథకాలకు కేంద్రం ఖర్చు చేస్తోందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన వేరే బాధ్యతలూ ఉంటాయని అన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని, అందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేస్తున్నామని గుర్తు చేశారు. 2010 ఏప్రిల్ లో ఉన్నట్టుగానే ఇప్పుడూ ఎక్సైజ్ డ్యూటీ ఉందని, అందులో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పారు.
అప్పుడు బ్యారెల్ పెట్రోల్ ధర 19.64 డాలర్లుగా ఉందనుకున్నా.. లీటర్ పెట్రోల్ పై 32 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేశారన్నారు. ఇప్పుడు బ్యారెల్ పై 75 డాలర్లున్నా అదే రూ.32 సుంకాన్ని వసూలు చేస్తున్నామని చెప్పారు. అయితే, రాబోయే నెలల్లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు దిగివస్తున్నాయన్నారు.