Nara Lokesh: మంగళగిరి ఎయిమ్స్ కు నీటి సరఫరాలో జాప్యంపై సీఎం జగన్ కు లేఖ రాసిన నారా లోకేశ్
- 2017లో రూ.10 కోట్ల విలువైన ప్రాజెక్టుకి ఆమోదం
- 2018లో పాలనాపరమైన అనుమతుల మంజూరు
- అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి
- ఎయిమ్స్ ను నిర్లక్ష్యం చేయొద్దన్న లోకేశ్
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (ఎయిమ్స్)కు నీటి సరఫరాలో జాప్యం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. దీనిపై తాను సీఎం జగన్ కు లేఖ రాసినట్టు తెలిపారు. మంగళగిరిలోని ఎయిమ్స్ కు నీటి సరఫరా సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎయిమ్స్ కు కృష్ణా నది నీటిని సరఫరా చేసేందుకు 2017లో రూ.10 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఆమోదం పొందిందని వివరించారు. ఆ ప్రాజెక్టుకు 2018లో పాలనాపరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయని వెల్లడించారు. అయితే, గత రెండేళ్ల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని లోకేశ్ ఆరోపించారు. మంగళగిరి ఎయిమ్స్ కు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎయిమ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని హితవు పలికారు.
"నేషనల్ హైవే-16కి ఎయిమ్స్ ను అనుసంధానించే విషయం, కృష్ణా నది నీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక వసతులు అసంపూర్తిగా ఉన్నాయి. మంగళగిరి లేదా తెనాలి కాలువ ద్వారా పైప్ లైన్ ఉపయోగించి నీటి సరఫరా సమస్యను పరిష్కరించవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ కూడా సీఎంను కోరారు. ఈ అంశంపై నేను కూడా సీఎంకు లేఖ రాశాను. ఎయిమ్స్ ను వెంటాడుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరాను" అంటూ లోకేశ్ వివరించారు.