Amitabh Bachchan: ఈ వయసులో డైలాగులు మర్చిపోతుంటాం: అమితాబ్ బచ్చన్
- చెహ్రే సినిమా ప్రచారంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చర్చ
- పాల్గొన్న కో-స్టార్ ఇమ్రాన్ హష్మి
- నిర్మాత ఆనంద్ పండిట్ ప్రశ్నలకు సమాధానమిచ్చిన నటులు
- 27న విడుదల కానున్న చిత్రం
భారతీయ చలన చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన నటుల్లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం ‘చెహ్రే’. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీతో కలిసి ఈ చిత్రంలో బిగ్‌బీ తెర పంచుకున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాత ఆనంద్ పండిట్, బిగ్‌బీ, ఇమ్రాన్ హష్మీ కలసి ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘సినిమా ఉత్సాహవంతమైన మాధ్యమం. ఒక కొత్త సినిమా, స్క్రిప్ట్ వచ్చిందంటే.. ఆ కథ దేని గురించి? నా పాత్ర ఏంటి? అనే ఎగ్జయిట్మెంట్ ఉంటుంది. దాంతోనే ముందుకు సాగుతాం’’ అని చెప్పారు. రూమీ జాఫ్రీ తన వద్దకు తెచ్చిన ‘చెహ్రే’ కథ తనకు బాగా నచ్చిందని, ఇంతకాలం కామెడీ సినిమాలు చేసిన తను ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా చేయలేదని బిగ్‌బీ అన్నారు. ఇలాంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.
సినిమా కోసం బిగ్‌బీ చేయగలిగినంతా చేస్తారని, నూటికి నూరుశాతం శ్రమిస్తారని ఇమ్రాన్ హష్మీ కొనియాడారు. దీనికి అమితాబ్ స్పందిస్తూ.. సినిమాలో నూరుశాతం ప్రదర్శన చేయకపోతే చిత్ర మేకర్స్‌ను అవమానించడమే అవుతుందని అన్నారు. ఎక్కువగా రిహార్సల్స్ చేయడం గురించి చెబుతూ, తన వయసులో పెద్ద పెద్ద డైలాగులు మర్చిపోతామనీ, అందుకే సాధ్యమైనన్ని ఎక్కువసార్లు రిహార్సల్స్ చేస్తానని అమితాబ్ చమత్కరించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ‘చెహ్రే’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.