Afghanistan: తరలింపే తక్షణ ప్రధాన కర్తవ్యం: 31 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టీకరణ
- మోదీ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం జరిగిన భేటీ
- క్లిష్ట పరిస్థితుల్లో ఆఫ్ఘన్ నుంచి తరలింపు చర్యలు చేపట్టాం
- ప్రతి ఒక్క భారతీయుడిని సురక్షితంగా తరలించాలి
ఆఫ్ఘనిస్థాన్ లో మారిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మధ్యాహ్నం జరిగిన అఖిలపక్ష సమావేశానికి 31 విపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యారు.
ఆప్ఘనిస్థాన్ నుంచి భారత్ కు తమను తరలించాలని కోరుతూ 15 వేల మంది భారత ప్రభుత్వాన్ని సంప్రదించారని జైశంకర్ తెలిపారు. అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలు చేపడుతున్న తరలింపు చర్యలను కూడా జైశంకర్ వివరించినట్లు సమాచారం. సమావేశానంతరం కొన్ని వివరాలను ట్విట్టర్ ద్వారా జైశంకర్ వెల్లడించారు.
అత్యంత కఠిన పరిస్థితుల్లో తరలింపు చర్యలను తాము చేపట్టామని జైశంకర్ తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు వద్ద పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ఆప్ఘన్ నుంచి తరలింపు ప్రక్రియే ప్రస్తుతం తమకు అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు.