AP High Court: డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవడంపై ఏపీ హైకోర్టులో విచారణ
- రాష్ట్రాభివృద్ధి సంస్థ పేరిట రుణ స్వీకరణ
- పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ నేత వెలగపూడి
- చట్టవిరుద్ధంగా వేల కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపణ
- వివరణ ఇచ్చిన ప్రభుత్వ న్యాయవాది
రాష్ట్రాభివృద్ధి సంస్థ పేరిట ఏపీ సర్కారు రుణాలు తీసుకోవడంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపింది. చట్టవిరుద్ధంగా రూ.25 వేల కోట్ల రుణం తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. రాష్ట్ర రుణాలపై కేంద్రం కూడా స్పందించిందని తన పిటిషన్ లో వివరించారు. ఈ కేసులో మరిన్ని పత్రాలు అందించేందుకు కొంత సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
కాగా, ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ... కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు వెళుతున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేసినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.