Afghanistan: శరీరాలు, అవయవాలు గాల్లో టోర్నడోల్లా ఎగిరాయి: కాబూల్​ పేలుళ్ల ప్రత్యక్ష సాక్షి కథనం

Bodies and Body Parts Flying Like Tornadoes Witness Explain Blast Site Tragedy

  • పిల్లలు, పెద్దలు రక్తపు ముద్దల్లా మారారు
  • కళ్లారా వినాశనాన్ని చూశాను
  • మురుగు కాల్వలో రక్తం పారింది
  • మాకు సాయం చేసేవారెవరూ లేరు

ఇప్పటికే తాలిబన్ల ఆక్రమణతో గుండె చెదిరిన ఆఫ్ఘన్లు.. నిన్నటి జంట బాంబు పేలుళ్లతో మరింత కకావికలమయ్యారు. ఏ దేశమైనా తమను తీసుకెళ్లకపోతుందా? అన్న ఆశతో కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఎదురుచూస్తున్న ఆ మనసులను తునాతునకలు చేసేసింది. ఆ భయంకర దృశ్యాలను తలచుకుంటూ ఆఫ్ఘన్లు మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. ఆ పేలుళ్లలో స్వల్ప గాయాలైన ఓ ప్రత్యక్ష సాక్షి అక్కడ జరిగిన బీభత్సాన్ని ఓ మీడియాకు కళ్లకు కట్టాడు. అమెరికా ప్రత్యేక వీసా మీద ఉన్నందున తన పేరును బయటకు వెల్లడించొద్దని అతడు అక్కడి మీడియాను కోరాడు.

అమెరికా ప్రత్యేక వలస వీసాపై అంతర్జాతీయ అభివృద్ధి గ్రూప్ లో పనిచేసిన ఆ వ్యక్తి కూడా.. ఎయిర్ పోర్టు గేట్ల దగ్గర వేలాది మంది ఆఫ్ఘన్లతో కలిసి ఎదురు చూశాడు. దాదాపు 10 గంటల పాటు విమానాశ్రయం యాబీ గేట్ వద్ద వేచి చూశాడు. సాయంత్రం 5 గంటలు కాగానే అతడి కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. తేరుకుని చూసే లోపు పదుల సంఖ్యలో రక్తపు ముద్దలుగా మారారు.

‘‘ఆ పేలుళ్ల ధాటికి నా చెవులకు రంధ్రాలు పడినంత పనైంది. కొద్ది సేపటి దాకా ఏమీ అర్థం కాలేదు. టోర్నడోలు ప్లాస్టిక్ సంచులను తీసుకెళ్తున్నట్టుగా జనాల శరీరాలు, శరీర అవయవాలు గాల్లో ఎగిరాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్దలు, పిల్లలు, మహిళల మృతదేహాలు రక్తపు ముద్దల్లా చెల్లాచెదురుగా పడి పోయాయి’’ అని ఆ వ్యక్తి వివరించాడు.

జీవితంలో ప్రపంచ వినాశనాన్ని చూడడం ఇప్పటికి సాధ్యమయ్యేది కాదనుకునేవాడినని, కానీ, ఇప్పుడు కళ్లారా చూశానని అతడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఇలాంటి సమయంలో తమకు సాయమందించేందుకు ఎవరూ లేరన్నాడు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు గానీ, ఎక్కడికక్కడ పడిపోయిన మృతదేహాలను అక్కడి నుంచి తీసేందుకుగానీ ఎవరూ లేరని, చాలా మంది నెత్తురోడుతున్న శరీరాలతో మురుగు కాల్వల్లో పడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కాల్వలోని కొద్దిపాటి నీళ్లలో రక్తంతో కలిసి.. నెత్తుటి ధారలు పారాయని చెప్పాడు.

శారీరకంగా తాను తీవ్రంగా గాయపడకపోయినప్పటికీ మానసికంగా మాత్రం పెద్ద గాయమే అయిందని చెప్పుకొచ్చాడు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదన్నాడు. ఈ పేలుళ్లు తనను ఎప్పుడూ సాధారణ జీవితం గడపనివ్వబోవని కన్నీరు పెట్టుకున్నాడు.

  • Loading...

More Telugu News