Caribbean Premiere League: స్మార్ట్ బాల్ ఇది.. క్రికెట్ లో తొలిసారి ప్రయోగం
- కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో వినియోగం
- బంతి లోపల ఎలక్ట్రానిక్ చిప్
- బంతి వేగాన్ని, గమనాన్ని లెక్కించేందుకు వీలు
- క్రికెట్ శిక్షణ తీసుకునే వారికి బాగా మేలు
క్రికెట్ లో అప్పటికీ..ఇప్పటికీ ఎన్నెన్నో మార్పులు సంభవించాయి. బ్యాట్ ను బంతి ఎడ్జ్ తీసుకున్నా.. ఎల్బీడబ్ల్యూలను పక్కాగా అంచనా వేయాలన్నా.. బంతి గమనాన్ని తెలుసుకోవాలన్నా.. టెక్నాలజీతో సులువైపోతోంది. స్నిక్కో మీటర్, హాట్ స్పాట్, అల్ట్రా ఎడ్జ్, హాక్ ఐ, స్పైడర్ కెమెరాలు, స్పీడ్ గన్నులు, ఎల్ఈడీ స్టంపులు, వాటికి మైక్రోఫోన్ ల వంటి ఎన్నెన్నో సాంకేతికతలను ప్రస్తుతం వాడుతున్నారు.
వాటికి ఇంకొకటి వచ్చి చేరింది. అదే స్మార్ట్ బాల్. బంతి గమనాన్ని, వేగాన్ని, బౌన్స్ అయిన విధానాన్ని లెక్కించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బంతి ఇది. అందులో భాగంగా బంతి లోపల ఓ స్మార్ట్ చిప్ ను పెడతారు. దానిని ఓ సిస్టమ్ లేదా.. ఓ యాప్ నకు అనుసంధానిస్తారు. బౌలర్ చేతి నుంచి బంతి విడుదలైనప్పటి నుంచి.. పిచ్ పై పడి కీపర్ చేతుల్లోకి లేదా బ్యాట్ కు తగిలేవరకు బంతి వేగం, గమనాన్ని ఆ చిప్ లెక్కిస్తుంది.
ఆ వివరాలన్నింటినీ అప్పటికే అనుసంధానించిన యాప్ కు పంపిస్తుంది. ఈ బాల్ ను ప్రస్తుతం నడుస్తున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ కు అనుమతి లభించలేదు. శిక్షణ తీసుకుంటున్న క్రికెటర్లు తమ పెర్ఫార్మెన్స్ ను మెరుగుపరుచుకునేందుకు శిక్షణలో ఈ బంతులను వాడనున్నట్టు తెలుస్తోంది. కూకాబుర్రా సంస్థ ఈ స్మార్ట్ బాల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బంతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలివీ..
- బౌలర్ చేతి నుంచి బంతి విడుదలైనప్పుడు దాని వేగం, దాని భ్రమణాలను లెక్కిస్తుంది
- పిచ్ మీద పడడానికి ముందు బంతి వేగం, భ్రమణాల లెక్కింపు.
- పిచ్ పై పడిన తర్వాత బంతి వేగం లెక్కింపు
- ఒక స్మార్ట్ బంతిని 30 గంటల పాటు వినియోగించుకునే వెసులుబాటు
- బంతిలో పెట్టిన ఎలక్ట్రానిక్ చిప్ లు సగటున 150 కిలోమీటర్ల వేగంతో తగిలే 300 ఇంపాక్ట్ లను తట్టుకోగలవు. గరిష్ఠంగా 300 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఇంపాక్ట్ లనూ తట్టుకుంటాయి.