Sharmila: ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుండు కేసీఆర్ దొర: షర్మిల
- వైఎస్సార్ గారు తన ఐదేండ్ల పాలనలో 2004, 2006, 2008లో డీఎస్సీ వేశారు
- లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశారు
- నేడు మాత్రం రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య
‘డీఎస్సీపై ఆశల్లేవ్’ పేరిట ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రభావంతో కొత్త టీచర్ పోస్టులపై ఆశలు లేకుండాపోతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. తెలంగాణలో బీఈడీ అభ్యర్థుల సంఖ్య భారీగా తగ్గిపోనుందని చెప్పారు. హేతుబద్ధీకరణతో 13 వేల పోస్టులను సర్దుబాటు చేస్తున్నారని, అవసరానికి మించి ఉపాధ్యాయుల సంఖ్య ఉంటుండడంతో కొత్త నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ విషయాలను షర్మిల ప్రస్తావించారు.
‘వైఎస్సార్ గారు తన ఐదేండ్ల పాలనలో 2004, 2006, 2008లో డీఎస్సీ వేసి లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశారు. 2008లో జంబో డీఎస్సీ వేసి ఒకేసారి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. నేడు రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటుంటే ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతుండు కేసీఆర్ దొర’ అని షర్మిల విమర్శించారు.