USA: తాలిబన్ ప్రభుత్వాన్ని ఆమోదించాలంటే షరతులు ఫాలో కావాల్సిందే: అమెరికా
- ఇప్పట్లో ఆమోదించేది లేదని కామెంట్
- మిత్రదేశాలదీ అదే నిర్ణయమని వెల్లడి
- తాలిబన్లు మాటలకే పరిమితమయ్యారన్న విదేశాంగ శాఖ
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పట్లో ఆమోదించేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. నాటో మిత్రదేశాలన్నీ తన బాటలోనే నడిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అంత తొందరేం లేదని పేర్కొంది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి దీనిపై ప్రకటన చేశారు.
తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపునివ్వాలంటే గతంలో అమెరికా చెప్పినట్టు కొన్ని విషయాలకు వారు హామీనివ్వాలని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లు ఆశ్రయం ఇవ్వొద్దన్నారు. మానవ హక్కులు, మహిళల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని చెప్పారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ లో రాయబార కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాలను కొనసాగించాల్సిందిగా తాలిబన్లు కోరుతున్నారని, కానీ, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. అమెరికన్లకు భద్రత కల్పిస్తామని తాలిబన్లు మాటలకే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.