Digital Currency: డిసెంబరు నాటికి దేశంలో డిజిటల్ కరెన్సీ... ఆర్బీఐ సన్నాహాలు
- ఈ-కరెన్సీపై వివరణ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్
- మొదట పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువస్తామని వెల్లడి
- సాంకేతిక అంశాలపై అధ్యయనం
- భద్రతపై ప్రధానంగా దృష్టి సారించిన ఆర్బీఐ
ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఆర్థిక వ్యవహారాలు కూడా డిజిటల్ మయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో డిజిటల్ కరెన్సీ తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, డిసెంబరు నాటికి దేశంలో ఈ-కరెన్సీ వస్తుందని తెలిపారు. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పారు. అయితే ఏ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డిజిటల్ కరెన్సీ తీసుకువచ్చేది ఆయన వెల్లడించలేదు.
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న క్రిప్టోకరెన్సీలు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్ టీ) ఆధారంగా పనిచేస్తుంటాయి. ఓ కేంద్రీయ వ్యవస్థ లేకుండానే డీఎల్ టీ ద్వారా క్రిప్టోకరెన్సీ ఆర్థిక లావాదేవీలు కొనసాగుతుంటాయి. అయితే, భారత్ లో మాత్రం సెంట్రలైజ్డ్ లెడ్జర్ విధానంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీఐసీ) తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇది పూర్తిగా కొత్త అంశం కావడంతో సాంకేతిక పరిజ్ఞానం అంశంలో ఎంతో లోతుగా ఆలోచిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించిన అనేక అంశాలపై అధ్యయనం చేస్తున్నామని, ముఖ్యంగా భద్రతపైనా, భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపైనా దృష్టి సారించామని వివరించారు.