Kabul: కాబూల్ బాంబు దాడి చేసిన ముఠాలో 14 మంది మలయాళీలు!
- బాంబు దాడికి బాధ్యత వహించిన ఐఎస్ఐఎస్-కే
- ఈ ముఠాలోనే 14 మంది మలయాళీలు
- 2014లో ఈ ముఠాలో చేరినట్లు అనుమానం
- 13 మంది కాబూల్‌లో.. ఇంటిని కాంటాక్ట్ చేసిన ఒక మలయాళీ
తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజల అవస్థలు చూసి జాలిపడుతున్న ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి కారణం రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్న కాబూల్ విమానాశ్రయం ప్రాంతంలో జరిగిన బాంబు దాడులే. ఈ బాంబు పేలుళ్లలో సుమారు 170 మంది మరణించారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లకు బాధ్యత వహించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్ఐఎస్-కే) ఉగ్రవాద ముఠాలో 14 మంది కేరళ వాసులు ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా బాగ్రామ్ జైల్లో ఉండగా తాలిబన్లు విడిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రచురితమైన కొన్ని కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ 14మంది మలయాళీల్లో 13 మంది కాబూల్‌లో ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాద సంస్థతోనే ఉండగా.. ఒక వ్యక్తి మాత్రం కుటుంబాన్ని సంప్రదించాడట. దీంతోనే ఈ వార్తలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 2014లో మోసుల్‌ను సిరియా, లేవాంట్ ఆక్రమించుకున్న తర్వాత చాలా మంది కేరళవాసులు భారత్ నుంచి వచ్చేసి ఈ జిహాదీ ముఠాలో చేరినట్లు సమాచారం. వీళ్లంతా కేరళలోని మలప్పురం, కాసరగాడ్, కన్నూర్ జిల్లాలకు చెందిన వారేనట. ఆ తర్వాత వీరిలో కొందరు ఆఫ్ఘనిస్థాన్ వచ్చినట్లు సమాచారం
ఐఎస్ఐఎస్-కేలో ఉన్న ఈ మలయాళీలను అడ్డుపెట్టుకొని.. అంతర్జాతీయంగా భారత పరువుకు భంగం కలిగించడానికి తాలిబన్లు ప్రయత్నిస్తారని భారత ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత కొందరు తాలిబన్ ఫైటర్లు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాలిబన్లలో కొందరు మలయాళీలు ఉన్నట్లు కనబడుతోందని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ఆ వీడియోలో తాలిబన్ల మాటలను బట్టి ఆయన ఈ విశ్లేషణ చేశారు. అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.