USA: భారత్, అమెరికా నిఘా సంస్థలకు సాయం చేసిన వారిని వదిలిపెట్టబోం.. బెదిరింపులకు దిగిన తాలిబన్లు
- ఆఫ్ఘన్లను వేటాడుతున్న అల్ అషా యూనిట్
- అమెరికా డేటా బేస్ లతో నాటోకు సాయం చేసిన వారి గుర్తింపు
- దాదాపు 3 లక్షల మంది సమాచారం నిక్షిప్తం
- 2009 నుంచి వారి డేటా నమోదు
ఓ వైపు స్నేహ హస్తం చాస్తూనే.. మరోవైపు తన అసలు స్వరూపాన్ని తాలిబన్లు బయటపెడుతున్నారు. అందరితో ముఖ్యంగా భారత్, అమెరికాతో మంచి సంబంధాలు కావాలంటూనే బెదిరింపులకు దిగుతున్నారు. భారత్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా– నిఘా సంస్థ), అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ సెక్యూరిటీ (ఎన్డీఎస్) పప్పెట్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వాళ్లందరినీ గమనిస్తూనే ఉంటామని బెదిరింపులకు పాల్పడ్డారు.
తాలిబన్ యూనిట్ అయిన ‘అల్ అషా’ బ్రిగేడియర్ కమాండర్ నవాజుద్దీన్ హక్కానీ ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ సహా నాటో దళాలకు సహకరించిన ఆఫ్ఘన్లను వేటాడేందుకు అమెరికా సైనికులు వాడిన హ్యాండ్ స్కానర్లు, వారి డేటా బేస్ ల నుంచి సమాచారం సేకరిస్తోంది.
‘‘ఇప్పుడు కాబూల్ మా వశమైపోయింది. మా పనులు మేం చేస్తున్నాం. నిఘా వ్యవస్థలపై మేం దృష్టి సారించాం. ప్రస్తుతం మా దళాలు చాలా వరకు మదర్సాల్లో సేద తీరుతున్నాయి. అమెరికన్ల డేటా బేస్ లన్నింటినీ ప్రస్తుతం మా అల్ అషా యూనిట్టే పర్యవేక్షిస్తోంది’’ అని జెంగర్ అనే ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చెప్పారు. అందులోని డేటాను జల్లెడ పట్టి అమెరికా, ఎన్డీఎస్ లకు పనిచేసిన వారిని వేటాడుతామన్నారు. విదేశీ మీడియా కేవలం తమను అప్రతిష్ఠ పాలు చేసేందుకే తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని ఆరోపించారు.
3 లక్షల మంది డేటా
గత 12 ఏళ్లలో కీలక సమాచారం అందించే వారిగా, నర్సులుగా, డ్రైవర్లుగా, సెక్రటరీలుగా కొన్ని వందల మంది ఆఫ్ఘన్లు అమెరికా, నాటో దళాల్లో పనిచేశారు. వారందరి డేటాను నమోదు చేసేందుకు అమెరికా దాదాపు 7 వేల స్కానర్లను వినియోగించింది. ఇప్పుడు అవన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే, కచ్చితంగా ఎన్ని స్కానర్లు తాలిబన్ల చేతుల్లో ఉన్నాయన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఆ డేటాబేస్ లలో ఆఫ్ఘన్ల వేలి ముద్రలు, కంటి స్కాన్లు, ఇతర సమాచారం నిక్షిప్తమై ఉంది.
2009 నుంచి మొదలుపెట్టిన ఈ డేటా సేకరణ ప్రక్రియలో దాదాపు 3 లక్షల మంది ఆఫ్ఘన్ల సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఎక్కువగా సైనికులు, ఖైదీల వివరాలే ఉన్నాయంటున్నారు. 2010లో ఆఫ్ఘన్ల వివరాల నమోదుకు ప్రత్యేకంగా బయోమెట్రిక్ కేంద్రాన్నే అమెరికా ఏర్పాటు చేసింది. ఈ డేటాను తాలిబన్ చొరబాటుదారులను లేదా రోడ్డు పక్కన బాంబులను తయారు చేసేవారిని గుర్తించేందుకు వినియోగించింది. 2014లో ‘ఐడెంటిటీ డామినెన్స్’గా దానికి పేరు పెట్టింది.