Nishad Kumar: టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు పతకాలు
- భారత్ ఖాతాలో రెండో రజతం
- ఈ ఉదయం టేబుల్ టెన్నిస్ లో రజతం గెలిచిన భవీనా
- తాజాగా హైజంప్ లో నిషాద్ మెరుగైన ప్రదర్శన
- 2.06 మీటర్ల జంప్ తో రజతం
- డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కు కాంస్యం
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో భారత్ కు నేడు మరో రెండు పతకాలు లభించాయి. ఈ ఉదయం టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భవీనా పటేల్ రజతం గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, హైజంప్ క్రీడాంశంలో నిషాద్ కుమార్ రజతం సాధించాడు. 2.06 మీటర్ల జంప్ తో నిషాద్ ఫైనల్ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, తన ప్రదర్శనతో నిషాద్ ఆసియా రికార్డు నెలకొల్పడం విశేషం.
కాగా, హైజంప్ లో అమెరికాకు చెందిన రోడెరిక్ టౌన్సెండ్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అమెరికాకే చెందిన డల్లాస్ వైజ్ కాంస్యం దక్కించుకున్నాడు. పసిడి విజేత టౌన్సెండ్ 2.15 మీటర్ల జంప్ తో అగ్రస్థానంలో నిలిచాడు.
అటు, డిస్కస్ త్రో క్రీడాంశంలో వినోద్ కుమార్ కాంస్యం సాధించాడు. దాంతో టోక్యో పారాలింపిక్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 3కి పెరిగింది.